కహ్లీల్ గిబ్రాన్ “The Prophet” – అనువాదం, తెలుగులో – #2


అధ్యాయం ౨: వివాహం, పిల్లలు, దానం, ఆహార అలవాట్లు మరియు శ్రమ.

ఆమ్లుస్తాఫా ప్రేమ యొక్క గుణగణాల గురించి చెప్పటం పూర్తి అవ్వగానే, ఆల్మిత్రా, “అట్టి యడల, వివాహం గురించి కూడా చెప్పండి,” అని అడిగింది.

దానికి ఆమ్లుస్తాఫా ఇలా సమాధానం ఇవ్వసాగాడు, “మీరు కలిసే పుట్టారు, ఎప్పటికీ కలిసే ఉంటారు. మరణం తన తెల్లటి రెక్కలతో మిమల్ని వేరు చెయ్యటానికి ప్రయత్నించినా మీరు ఎప్పటికీ కలిసే ఉంటారు. అవును, ఆ దేవుని నిషబ్ధ జ్ఞాపకాలలో మీరు ఒక్కటిగానే ఉంటారు. కానీ, మీ మధ్య కొంత ద్వారాన్ని ఉండనివ్వండి. ఆ దైవానికి మీ మధ్య కొంత చోటును కల్పించండి.

ఒకరిని ఒకరు అంతులేనంతగా ప్రేమించండి. కానీ ఆ ప్రేమ మిమల్ని బండించివేసే సంకెల కాకూడదు. అది ఒక సముద్రం కదిలే కెరటనికి ఇచ్చే స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని ఇవ్వగలగాలి. మీరు ప్రేమతో ఒకరి మనసును ఒకరు నింపుకొండి, కానీ ఒకరి మనసును మరొకరు బలవంతంగా పీల్చకండి. అనుక్షణం గాన నృత్యాలు మధ్య ఆనందంగా ఉండండి, కాని ఎవరి సంగీతానికి వారు నృత్యం చేసే స్వేచ్చను కాపాడుకోండి. ఒక వీణ తీగలు అన్నీ కలిసే స్వరం వచ్చినా, అవి వేరువేరుగా సంగీతాన్ని ఇచ్చే సమర్థత కొలిపోవు కదా!

మీ మనసుని ఇచ్చిపుచుకొండి, కానీ అది బందికానా అవ్వకూడదు. ప్రకృతి మాత్రమే మీ మనసుకి నిజమైన యజమాని.

గుడి స్తంభాలు అన్నీ కలిసి గోపురాన్ని నిలబెట్టినా, విడిగానే కదా నిలుచున్నాయి? ఒక మర్రిచెట్టు నీడల్లో మరో మర్రిచెట్టు ఎదగలేదు కదా!”

అలా వివాహం గురించి మాట్లాడిన ఆమ్లుస్తాఫాను ఆ నగరసమూహంలో నిలుచున్న ఒక తల్లి తన బిడ్డను గుండెలకు ఎత్తుకుని, “పిల్లల గురించి చెప్పండి,” అని అడిగింది.

దానికి ఆమ్లుస్తాఫా, “మీ పిల్లలు మీయొక్క పిల్లలు కాదు. వారు ప్రకృతి ద్వారా సాగుతున్న ప్రాణపరంపర యొక్క నిదర్శనం. వారు మీనుండి లేదా మీద్వారా ఉద్భవించచ్చు, కానీ, మీ వల్ల కాదు. వారు మీతో ఉండొచ్చు, కానీ మీకు సొంతం కాదు.

మీ పిల్లలకి మీరు మీ ప్రేమను ఇవ్వండి, మీ నమ్మకాలూ, ఆలోచనలూ కాదు. వారికి వారి ఆలోచన ఊరుతుంది. మీరు వారి శరీరానికి ఆశ్రయం ఇవ్వండి, ఆత్మకు కాదు. వారి ఆత్మలు, ఆలోచనలు రేపటికి చెందినవి. ఆ రేపటి గురించి మీరో, నేనో తెలుసుకోలేము, కలల్లో కూడా! మీరు వారిలా ఉండటానికి కృషి చెయ్యొచ్చు, కానీ వారిని మీలా మార్చటానికి ప్రయత్నించకండి. వారి జీవితం వెనక్కి వెళ్లటంలేదు, వారి బ్రతుకులు నిన్నటి కోసం కాదు.

మీరు జీవంతో నిండివున్న బాణాల్లాంటి మీ పిల్లల్ని విడిచిపెట్టే ధనస్సు లాంటివారు మాత్రమే. మీరు విల్లుకాడు కాదు. విల్లుకాడు ఆ పైవాడు. ఆ వీల్లుకాడు అంతులేని విశ్వపు మజిలిలోకి ఈ బాణాలను ఎక్కుపెడతాడు. ఆ గురిని అందుకోవటానికి మిమల్ని వంచుతాడు. కానీ ఆ బాధ ఆ బాణాలను సందించటనికి మాత్రమే.

ఆ విల్లుకాడి చేతిలోని బాధను ఆనందంగా స్వీకరించండి. అతనికి ఎగిరే బాణం ఎంత ఇష్టమో, కదలక స్థిరంగా ఉన్న విల్లు కూడా అంతే ఇష్టం.” అని పిల్లలతో తల్లితండ్రులకు ఉన్న ప్రాకృతిక సంబంధాన్ని తెలియచేశాడు.

అప్పుడు ఒక ధనికుడు, “మరి దానం గురించి కూడా చెప్పండి,” అని అడిగాడు.

దానికి ఆమ్లుస్తాఫా, “మీరు మీ ధనాన్ని ఇచ్చినప్పుడు కేవలం కొంత మాత్రమే ఇస్తున్నట్టు అర్థం. మీరు మీ మొత్తాన్ని ఇచ్చినప్పుడే నిజమైన దానం చేసినట్టు అన్న విషయాన్ని గమనించండి. మీ ధనము మీ రేపటి భయము కాక ఇంకేమిటి? అలా జీవితం అంతా రేపటి కోసం ధనము దాచుకోవడం అంటే తీర్థయాత్రకు వెళ్లే దారిలో ఒక కుక్క జాడతెలియని చోట ఏముకులను దాచుకునట్టే కదా! అవసరానికి అవసరాన్ని మించిన భయం ఉందా? ఒక నిండుగా ఉన్న నూతిలోకి చూసి కూడా భయపడితే, ఆ భయం దాహం గురించా లేక దాహం ఎప్పటికీ తీరదు ఎమో అన్న వెర్రి భయంతోనా?

ఎంతో ఉండి కూడా పేరూ, ప్రతిష్ఠా, పరపతి కోసం ఇచ్చే దానం ఎప్పటికీ పుర్తికాదు. అది ఎటువంటి మంచికి ఉపయోగపడదు. కానీ, చాలా తక్కువ ఉన్నా ఉన్నది మొత్తం ఇచ్చేసేవారు ఉన్నారు. వీరు దైవంపై, దైవాసీసులపై నిజమైన విశ్వాసం కలిగినవారు. వారికి ఎప్పటికీ ఎటువంటి లోటూ రాదు.

ఆనందంతో ఇచ్చువారికి ఆనందమే బహుమతి, బాధతో ఇచ్చువరికి బాధే ప్రయిచ్చితం. అయితే, ఎవరైతే ఇస్తూ ఇస్తున్నందుకు బాధపడరో, ఎవరైతే ఆనందాన్నీ కోరుకోరో, లేక వారి పుణ్యం కలుగుతుందని ఆశించరో, వారు పూలకొండల నుంచి వచ్చు పరిమళం ఏదీ ఆశించక గుభాలింపుగా ఆకాశాన్ని చేరునట్టు దానం చేస్తారు. అటువంటి వారి చేతులలో నుంచి భగవంతుడు మాట్లాడతాడు. వారి దయా కరుణా కలిగిన కన్నుల వెనుక నుంచి తన చిరునవ్వులను భగవంతుడు ఈ భూమిపై వెదజల్లుతాడు.

అడగగానే ఇవ్వటం చాలా ఉత్తమమైన మార్గం, కానీ అడగకుండా, అవసరాన్ని అర్థం చేసుకుని ఇవ్వటం అన్నిటికన్నా గొప్ప విషయం. అలా అవసరమైన వారికి ఇచ్చే యత్నం లో మీరు పొందే ఆనందం దానం ఇచ్చిన అనుభవం కన్నా చాలా గొప్పది. అయినా మీరు ఇవ్వకుండా ఎందుకు ఉండాలి? మీ దగ్గర ఉన్నది ఏది అయినా దానిని ఎప్పటికైనా ఇచ్చేయలి. ఆ ఇచ్చేది ఎదో మీ స్వయం హస్తాలతో ఇవ్వండి, మీ వారసుల మీదుగా కాదు.

మీరు తరుచూ అంటూ ఉంటారు, “అర్హునికి మాత్రమే నేను ఆసరా ఇస్తాను,” అని. కానీ, నిండు పండ్లని పూచు చెట్ట్లు అలా అనట్లేదు, మీ ఇంట్లో ఉండు పశుసంపద అలా అనట్లేదు. వాటి దగ్గర ఉన్నవి అంతా అవి ఇస్తున్నాయి, ఎందుకంటే దాచటం అనగా నాశనం చెయ్యటం అని వాటికి తెలుసు కనక. ప్రతి దినమూ రేయిని పగటిని బేధం లేకుండా పొందువారు ఎవ్వరు అయినా నీ నుంచి దానం పొందటానికి అర్హులే కదా. సముద్రపు నీరు తాగే ఎవ్వరు అయినా నీ సరస్సు లాంటి ధనము నుంచి తీసుకొనుటకు అర్హులే. అయినా తీసుకోవటంలో కావాల్సిన ధైర్యం, విశ్వాసం, ఇవ్వటానికి ఎక్కడా తీసిపోవు.

ఇచ్చువాడివి కావొచ్చు కానీ నీ అర్హత ఏముంది ఎదుటివారి అర్హతను నిర్ణయించుటకు? నీ చాతిలో ఏమి నింపావని వారి ఆత్మ గౌరవాన్ని కించపరుస్తావు? దానం తీసుకోను వారి అర్హత చూసిన నీవు, దానం ఇవ్వగల నీ సామర్ధ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకో. నువ్వే ఒక దానాయంత్రంగా మారు. ఎందుకనగా, ఇచ్చేది, తిరిగి పుచ్చుకునేది, ప్రకృతి, జీవితం మాత్రమే. నువ్వు కేవలం ఒక సాక్షివి.

ఇక దానం పుచ్చుకున్న వారు: మీరు రుణం తీసుకున్నాం అన్న భావనలో కూరుకుపొకండి. దానికి బదులుగా మీకు, మీకు దానం చేసిన వారికి మధ్య ఒక విడతీయలేని సంబంధాన్ని నెలకొలపండి. ఇద్దరూ కలిసి పైకి ఎదగండి. వారు దానం వల్ల వచ్చే దైవత్వాన్ని రెక్కలుగా చేసుకు ఎదిగితే, మీరు దానం తీసుకున్న బహుమతులతో ఎదగండి. కానీ, మీరు తీసుకున్న అప్పు గురించి పదే పదే ఆలోచిస్తూ దానం ఇచ్చిన మనసును అవమానించి కించపరచకండి. మీకు దానం ఇచ్చిన వారు దాన గుణానికి ప్రతిరూపమైన నేలకు, ఆ పైవాడైన భగవంతుడికీ పుట్టిన బిడ్డలు.” అని దానం గురించి అతని ప్రసంగాన్ని ముగించాడు ఆమ్లుస్తాఫా.

అప్పుడు ఆ నగరంలో నివసించే ఒక ముసలివాడు మాట్లాడాడు. అతడు ఆ నగరంలో అతిథి గృహాలను చూసుకునే వ్యక్తి. “ఆహార ఆచారాల గురించి కూడా చెప్పండి,” అని అతను అడిగాడు.

దానికి కూడా ఆమ్లుస్తాఫా సమాధానం ఇచ్చాడు: “మనము భూమినుండి వచ్చే సువాసనను పీల్చో, మొక్కలువలే సూర్యుని కాంతిని తేసుకునో బ్రతకలేము. మన ఆకలి తీరాలి అంటే ఒక ప్రాణాన్ని చంపాలి. మన దాహం తీరాలి అంటే మరొక జీవిని దాని అమ్మ నుంచి లాగి వెయ్యాలి. కాబట్టీ, వాటిని ఒక ప్రార్థనగా చెయ్యండి. మీ కత్తులు, సుత్తులు, పలుగూ పారలను ఆ ప్రాణాన్ని కోల్పోయే జీవి నివసించు మందిరంగా భావించండి. వాటి వల్ల, మన కోసం, అడువుల్లో నగరాల్లో నివసించే ప్రాణులు ప్రాణాన్ని వీడుతున్నాయి. గుర్తు పెట్టుకోండి, ఆ ప్రాణులు మనిషి కన్నా స్వచ్చమైనవి, ఎంతో అమాయకమైనవి.

నువ్వు ఒక జంతువును చంపినప్పుడు, మనసులో ఒక ప్రార్థన చెయ్యి: ‘నిన్ను చంపు అదే శక్తి నన్నూ చంపుతుంది, నేను కూడా వేరొక జీవికి ఆహారము అవుతాను. ఏ ప్రాకృతిక ప్రక్రియ వలన నీవు నా చేతికి చిక్కావో, అదే ప్రక్రియ వలన నేను నన్ను మించిన చేతికి దొరుకుతాను. నీ రక్తం నా రక్తం వేరు కాదు. అది ఈ ప్రకృతి అనే మహా వృక్షం ఎదగటానికి వెర్లతో తీసుకునే తేమ మాత్రమే.’

ఇదే విధంగా, నువ్వు ఒక పండుని నోటితో కొరికినంతన వెంటనే మనసులో చెప్పుకో: ‘నీ విత్తనాలు నా లోపల జన్మని తీసుకుంటాయి. నీ రేపటి మొగ్గలు నా హృదయంలో వికసిస్తాయి. మనం ఇద్దరం ఆనందంగా అంతులేని కాలాల చివ్వరి వరుకూ కలిసే ఉంటాము.’ అని.

వసంతం వచ్చి నీవు మద్య పానీయాలు కోసం పండ్లను పోగుచేయి వేళ, ‘నేను కూడా ఒక పండ్ల చెట్టునే, నేను కూడా ఇలాగే పోగుచెయ్యబడతా; నేను కూడా ఇలాగే ఎప్పటికీ తరగక లెక్కలేనన్ని శరీరాల్లోకి పొయ్యబడతను.’ అని. శీతాకాలంలో వాటిని ఆశ్వదించు సమయములో, ఆనందంగా గానం చెయ్యండి: వసంతం గురించీ, చెట్ల గురించి, పండ్ల గురించీ, మీ గురించి.” అని ఆమ్లుస్తాఫా ముగించాడు.

వెంటనే ఒక రైతు, “శ్రమ గురించి చెప్పండి,” అని అడిగాడు.

దానికి కూడా ఆమ్లుస్తాఫా సమాధానమిచ్చాడు: “మనం ఈ నేలతో, ఈ మట్టితో కొనసాగించే అనుబంధమే శ్రమ. శ్రమ లేక తీరుబడిగా ఉండటం అంటే కాలానికి, కాలమాన పరిస్థితులకు అపరిచితులుగా మారిపోతున్నాము అని అర్థము. కాలం, కాలంతో పాటుగా భూమీ, ఎంతో గర్వంగా ముందుకు, ఆ అంతులేని కాలలోకి పయణమవుతూ ఉంటాయి. మనము కూడా వారితో కలవాలి.

నువ్వు పని చేస్తునప్పుడు, నీవు ఒక వేణువు అన్న విషయము తెలుసుకో. నీ శ్రమలో పడి నలిగే గంటలు, నీ హృదయము నుండి గానములా వెలువడతాయి. అటువంటి గానములో ఎవరికి మాత్రం పాలుపంచుకోవాలని ఉండదు?

ఎలప్పుడు మీకు పని ఒక శాపం అని, శ్రమ ఒక దురదృష్టం అని చెప్పబడింది. కానీ, ఓ ఓర్ఫలేస్ నగరవాసులారా, నేను చెప్తున్నా వినండి. శ్రమ ఈ భూమిపైన కనబడిన మొట్టమొదటి కల. శ్రమ ఈ భూమిపై నిలవబడే చివ్వరి కళ. ఈ భూమి పుట్టిన వేళ పుట్టింది శ్రమ, అది ఈ భూమాత సైతం కోరుకునే ఒకే ఒక్క కోరిక. అటువంటి శ్రమ చేస్తున్న మీరు అంతా జీవితాన్ని నిజమైన రీతిలో ప్రేమిస్తున్నారు. శ్రమ జీవిత అర్ధానికి అతి దగ్గరగా ఉండు ఒకే ఒక్క దారి.

కానీ శ్రమ కలిగించే బాధలో మీరు మీ పుట్టుకను ఒక దురదృష్టంగా భావిస్తే, మీ తలరాతను మీరు శంకిస్తీ, తెలుసుకోండి, శ్రమ వల్ల మీ తలపై పుట్టు చెమట చుక్కే మీ తలరాతను మార్చే శక్తి.

మీకు జీవితం ఒక అంధకారం అని చెప్పబడింది. బాధలో మీరు అదే నమ్ముతారు. కానీ నేను చెబుతున్నా, జీవితం నిజంగానే అంధకారం; కోరిక లేకుంటే. ఆ కోరిక గుడ్డిది అవుతుంది; జ్ఞానం లేకుంటే. ఆ జ్ఞానం అర్థం లేకుండా పోతుంది; శ్రమ లేకుంటే. ఆ శ్రమ వ్యర్థం అయిపోతుంది; ప్రేమ లేకుంటే. ప్రేమతో పనిచేసే ప్రతీ క్షణం మీరు మీతోనే కాక, మీ తోటి వారితో, ఆ దైవంతో కూడా ముడిపడి ఉంటారు.

ప్రేమ లేకుండా చేసే పని ఫలితాన్ని ఇస్తుందా? ప్రతీ బట్టను గుండెల్లోంచి తీసిన దారాలతో మీ ప్రియులారు వేసుకోబోయే కానుకగా నేయ్యాలి. ఇల్లు కట్టే ప్రతీ ఇటుకను ఎంతో ఇష్టంతో, మీ ప్రియురాలితో నువ్వు ఉండబోయే ఇంటిని కడుతునట్టుగా పేర్చాలి. నాటే ప్రతీ విత్తనం, పండు అయ్యాకా మీ ప్రియురాలి కోసం తీసుకెళ్లే పండులాగ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా నాటాలి, పెంచాలి, సాగుచెయ్యాలి. చేసే ప్రతీ పనిలో నీ ఊపిరిని ఉంచాలి; మీ ముందు మీ పని చేసి వేరు లోకాలకి తరలి వెళ్ళిన గొప్పవారు అంతా మీ వెంటే ఉండి మీ పనిని చూస్తున్నారు అని తెలుసుకోవాలి.

ఒక సారి నేను ఎవరో వారి నిదురలో అనటం విన్నాను: భూమిని సాగు చేయ్యు వారికన్నా, ఒక రాతిలో తన ఆత్మను పెట్టి రుపమునిచ్చే శిల్పే గొప్పవాడు అని. కాళ్ళకి చెప్పులు చేయ్యువాడికన్నా, ఆ ఇంద్రధనస్సు రంగులతో వస్త్రాలను నేచేవాడు గొప్పవాడు అని. లేదు. నిదురలో కాదు, ఈ మద్యనపు సూర్యుని కింద నుంచుని చెబుతున్నా: ఏ రోజూ ఆ గాలి ఆశోక వృక్షంతో ప్రేమగా మాట్లాడి గడ్డి పరకను చులకనగా చూడదు కదా? ఇంకా ఆ గాలిని ప్రేమతో ఎవరైతే పుచ్చుకున్నారో, వారే గొప్పవారు.

కంటికి కనబడే ప్రేమే శ్రమ. అటువంటి ప్రేమతో మీరు పని చేయలేనప్పుడు ఆ పనిని వడిచిపెట్టి, గుడి ప్రాంగణాల్లో పని మీద ప్రేమతో పని చేసి సంపాదించే వారి దగ్గర బిచ్చం తీసుకుని బ్రతకటం ఉత్తమం. ఎందుకనగా, ఇష్టం లేకుండా మీరు వండిన భోజనం, రుచి కోల్పోయి అతిథి సగం ఆకలినే తీరుస్తుంది. ఇష్టం లేకుండా మీరు కోసిన పువ్వులు సువాసనను పోగొట్టుకుని, విషాన్ని వెడచిమ్ముతాయి. మీరు ఒక గంధర్వుని వలే పాడగలిగినా, ఇష్టం లేక పాడిన పాట ఆ రేయీ పగటి మాధుర్యాన్ని అస్తవస్తం చేస్తుంది.” అని ఆమ్లుస్తాఫా వివరించాడు.

అంతట ఒక మహిళ ముందుకు వచ్చి, “ఆనందం – బాధ గురించి చెప్పండి,” అని అడిగింది.


{తరువాయి భాగం తరువాత blog లో. . .}